Monday, January 16, 2023

పతంగులు ఎగురవేయటంలో దాగిన జీవిత సత్యాలు


 సంక్రాతి అనగానే పళ్ళెటూళ్ళలో ఉత్సాహ భరితవాతావరణం కనిపిస్తుంది. రంగువళ్ళలు, భోగి మంటలు,

గొబ్బమ్మలు,హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో  గ్రామాలన్నీ పండుగ శోభతో అలరారుతూ ఉంటాయి. అదే పట్టణాలలో  అయితే పంతగులను  ఎగురవేయిటం ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకించి  హైదారాబాదు నగరంలో పంతగుల సందడి అంతా ఇంతా కాదు.ఈరోజుల్లో ఆకాశహర్మ్యాలు రావటంతో కొంత సందడి తగ్గింది గాని మా చిన్నతంలో అయితే దసరా సెలవుల నుంచి మొదలు పెడితే సంక్రాతి సెలవులు అయ్యేవరకు పతంగులు ఎగుర వేసే వాళ్ళం.


పతంగులు ఎగురవేయటం అనే అభిరుచి మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. పతంగుల ఎగుర వేయిటంలో మెలుకువలను మన నిత్యజీవితంలో వౄత్తిగత, వ్యక్తిత్వనిర్మాణానికి ఉపయోగపడతాయి.ఒక్క  మాటలో చెప్పాలంటే పతంగులు ఎగురవేసే మెలుకువలు, వ్యక్తిత్వనిర్మాణానికి అన్వయించుకోవచ్చు.


పతంగులు ఎగురవేయటాని కన్న  ముందు మెదటగా దారాన్ని చర్ఖాకు తిప్పటం నేర్చుకోవాలి.దారాన్ని తిప్పటంలో  నిష్ణాతులయిన తర్వాతే పతంగులు ఎగురటానికి అనుమతిచ్చేవారు మా పెద్దలు.అ తర్వాత కన్నాలు కట్టడం.ఇక మూడో స్టెప్ పతంగి పైకి లేపడం. ఈ మూదు అంశాలు పతంగి ఎగరవేసే కళలో బేసిక్స్ అన్నమాట .ఇవి కరెక్టుగ వస్తేనే  పతంగులు సరిగా ఎగురుతాయి. అంటే ఏ రంగంలోనైనా నిష్టాతులు  కావలంటే  మొదటగా ఆ రంగంలోని బేసిక్స్ నుంచి మెదలవ్వాలని అర్దం.ఇంజనీరింగ్ లేదా డిప్లొమోహోల్డర్స్ అప్రెంటిషిప్ చేయటం, రాజకీయాల్లోని వారు సర్పంచ్ గా, వార్డ్ మెంబర్లుగా పనిచేయటం, పైలట్లకి కూడా  హెలికాప్టర్ పైకి లేపటం ముందు నేర్పిస్తారు. కార్ డ్రైవింగ్ లో కుడా మొదటగా ఫస్ట్ గేర్ లో  నడపడం నేర్పిస్తారుగ

 

పతంగి పైకి లేపటం అత్యంత మెళుకవైన దశ. ఇది కరెక్టుగ వస్తేనే పతంగులు సరిగా ఎగురుతాయి.ఈ దశలో మెదటగా, గాలి యెక్క దశను గమనించి దానికి అణుగుణంగ బిల్డింగ్ పై నుంచి పైకి ఎగిరే వరకు. అంటే ఒక 100 నుంచి 200 ఫీట్ల వరకు ఎగురవేయటం నేర్చించేవారు.ఇందులో కనుక సక్సెస్ అయితే పతంగ్ జస్ట్ పిరాయిస్తే చాలు (దారం వదలితే )చాలు అదంతల అదే ఎగిరిపోతుంది.ఒకసారి పతంగి  ఆకాశంలోకి ఎగిరితే ఇక కిందికి దిగే ప్రసక్తేరాదు. ఇదే మన నేర్చుకోవాల్సిన విలువైన పాఠం.  ఇది మన నిత్యజీవితంలోకి  

అన్వయించుకుంటే బ్రేక్ ఈవెన్ అన్నమాట. ఒకసారి బ్రేక్ ఈవెన్ వచ్చిందంటే వ్యాపారం ముందుకు ఎలా సాగిపోతుందో తెలుసుగా.మెదట్లో ఏదైనా కొంత కష్టంగా ఉంటుంది.  ఏ విధంగా అయితే ఒకసారి పతంగి ఆకాశంలోకి ఎగిరితే ఇక కిందికి దిగే ప్రసక్తేరాదో అదేవిధంగా ఏ రంగంలోనైనా బాలారిష్టాలను అధిగమించి,కొద్దిగా ఆ విద్యలో లేదా  రంగం లో పట్టు సాధిస్తే, ఒకసారి  స్థిరపడ్డామంటే ఇక మన పని సులువు అవుతుంది. ముందుకు సాగిపోతుంది.


 ఇక మన పతంగి అకాశంలో రాగానే అందరికీ కనిపిస్తుంది.మన ప్రక్కనుంచి,మన వెనుకవైపు నుంచి  మనపై పేంచ్ (ముడి) వేసి మన పతంగిని కోయటానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. అప్పుడు మనం జాగరూకతతో ఉండి కొన్ని మెళువలు పాటించాలి.ప్రత్యర్థులు సహజంగా రెండు విధాలుగా మన పతంగి కోయటానికి ప్రయత్నిస్తారు. ఒకటి మన దారం పై నుంచి ,మన దారం కింది నుంచి.ఒకవేళ మన ప్రత్యర్థి మన దారం పై నుంచి  కోయటానికి ప్రయత్నిస్తే మన పతంగి  బరువైనదైనప్పుడు నిటారుగు స్టిఫుగా ఉంచాలి. అప్పుడు మన బరువుకి అతని పతంగి తెగిపోతుంది.అదే మన జీవితానికి అన్వయించుకుంటే మన రంగంలోని ప్రత్యర్థులు మనల్ని మానసికంగా,వృత్తి పరంగానో దాడిచేసి ఓడించాలనుకున్నప్పుడు మనం ఎలాంటి బెరుకు లేకుండా అలాగే   నిలబడితే వారే తోకముడించి పారిపోతారు. ఇక మన ప్రత్యర్థులు దారం  పై నుంచి కోయటానికి ప్రయత్నిస్తే మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఇంకా పైకి పిలాయించి మన పతంగి బరువైనప్పుడు మనమే పై మంచి రోక్  కొట్టడం (వంచడం) ద్వారా  మన పతంగి బరువుతో  ఎదుటి వారి పతంగి కోయివచ్చు

  

ఇక మనం ప్రత్యర్ధులపై విరుచుకుపడాలనుకున్నప్పుడు? దానికి పతంగులు ఎగుర వేయిటంలో కూడా సమాధానం ఉంది. ఇందులో మొదటిది డిఫెన్సివ్ స్ట్రాటజి.మన కన్నా ముందు ఉన్న పతంగిని  కట్ చేయాలనుకున్నప్పుడు ,మన పతంగి బరువైనప్పుడు మనమే పై మంచి రోక్  కొట్టడం (వంచడం) ద్వారా  మన పతంగి బరువుతో  ఎదుటి వారి పతంగి కోయివచ్చు. లేదా మనం ఎదుటి వారి పతంగి ముందుకు పిలాయించి (దారం వదలి) అగకుండా కింది నుంచి రోక్ కొట్టీ  కీంచ్ లాగాలి. ఇది మన 20-20 క్రికెట్ ఫార్మాట్లో సిక్సులు  ఫోర్లు కొట్టడం లాంటిది.

ఇది మన జీవితానికి అన్వయించికుంటే మనం మన రంగంలో అన్ని పరిస్ధితులు అనుకూలంగా  ఉండి మంచి స్థితిలో ఉన్నప్పుడు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా సాగిపోవాలి.

  

ఇక ఇందులో చివరి   స్ట్రాటజి విషయానికి వస్తే ప్రత్యర్థి మనపై దాడి చేసినా, మనం ప్రత్యర్థితో తలపడ్డా పెయించ్ పడంగానే డీల్ వదలి చూస్తే ఫలితం ఏదో ఒక వైపు వస్తుంది. ఇదే స్ట్రాటజీ మన లైఫ్ లో అన్వయిస్తే మనకి  ఎవరితోనైనా ఘర్షణ తలెత్తినపుడు సహనంతో మన వైఖరికి మన కట్టుబడి ఉంటే ఫలితం ఏదో ఒకటి తేలుతుంది.ఈ  విధంగా చెప్పుకుంటూ పోతే పతంగులు ఎగరవేయటంలో ప్రతిదశలో మనకి ఏదో ఒక జీవిత సత్యం గోచరిస్తుంది

Thursday, February 25, 2021

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చూడాల్సిన సినిమా న్యూటన్

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చూడాల్సిన సినిమా "న్యూటన్"



త్వరలో జరగబోయే మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైద్రాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల వికారాబాద్ జిల్లా మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ కు హాజరు అవడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో నేను చూసిన న్యూటన్ సినిమా గుర్తుకొచ్చింది

ఎన్నికల్లో పాల్గొనే అధికారుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అధికారుల్లో స్ఫూర్తి నింపుతుంది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో రాజ్​కుమార్​ రావ్​ ప్రధానపాత్రలో నటించగా.. పంకజ్​ త్రిపాఠి కీలకపాత్ర పోషించాడు

ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించేవారికి ఇది స్ఫూర్తినిస్తుంది

ఎన్నికల రిటర్నింగ్​ అధికారిగా రాజ్​కుమార్​ రావ్​ నటించాడు. ఎన్నికల విధుల్లో భాగంగా అతడిని నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంలో విధులను కేటాయిస్తారు. ఆ పోలింగ్ బూత్​ వద్ద సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​ (సీఆర్పీఎఫ్​) అసిస్టెంట్​ కమాండెంట్​గా పంకజ్​ త్రిపాఠి కూడా భద్రతా అధికారిగా నియమిస్తారు. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంలో ఈ అధికారులు పోలింగ్​ ఏ విధంగా ముగించారనే నేపథ్యంతో ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కింది.


బిహార్​ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారుల్లో స్ఫూర్తిని నింపడానికి వారి శిక్షణలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు

Thursday, January 14, 2021

పది కోట్ల కు పైగా వ్యూస్ తో యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న ‘ఆడ నెమలి




యూట్యూబ్‌లో తెలంగాణ పల్లె పాట ‘ఆడ నెమలి'కు నెటిజన్లు పట్టం కడుతున్నారు. 

ఈ తరహా పాటలు పాడే సింగర్ మంగ్లీ  తన యూట్యూబ్ చానల్‌లో స్వచ్ఛమైన తెలంగాణ పల్లె గొంతుక ‘కనకవ్వ’తో కలిసి పాడిన ‘ఆడ నెమలి’ అనే పాట దుమ్ములేపుతోంది.తెలంగాణ లో ఏ పెళ్లి డిజేలో చూసినా ఇదే పాట వినిపిస్తోంది.

‘నర్సపెల్లి గండిలోన గంగధారి.. ఆడ నెమ‌లి ఆటలకు గంగధారి’ అంటూ సాగే పాట యూట్యూబ్ ప్రేక్ష‌కుల‌నే కాక‌.. సంగీత ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. 

గత ఏడాది ఆగ‌స్టు 29న విడుదలైన ఈ పాట‌ను మంగ్లీతో పాటు ‘డివ డివ, గుట్ట గుట్ట తిరిగెటోడ’ వంటి జనాదరణ పొందిన పాటలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జాను లిరీపై చిత్రీకరించారు. ఇప్పటికే తన గాత్రంతో యావత్ తెలంగాణను ఉర్రూతలూగిస్తోన్న కనకవ్వ వాయిస్ ఈ పాటకు ప్రత్యేకార్షణ. 

మంగ్లీ, జాను లిరీ తమ డ్యాన్స్‌తో ఈ పాటకు కొత్త జోష్‌ను తీసుకురాగా.. పల్లెటూరి అందాలను సరికొత్తగా చూపించిన ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

విడుదలైన నాలుగు నెలల్లోనే పదకొండు కోట్లమంది వీక్షించడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే మంగ్లీ యూట్యూబ్ చానల్‌కు మంచి ఆదరణ దక్కుతుండగా.. 10 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉండటం విశేషం

Wednesday, December 16, 2020

డిల్లీ క్రైమ్ - ప్రతి పభుత్వ ఉద్యోగి చూడాల్సిందే

 ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన రెండు సినిమాలు ఢిల్లీ క్రైమ్,న్యూటన్



డిసెంబర్ 16, 2012


దేశ చరిత్రలో అత్యంత సంచలనం కలిగించిన అమానవీయ సంఘటన జరిగిన రోజు


 దేశ నేర పరిశోధనలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు 


యాదృచ్ఛికంగా నేను రెండు రోజుల క్రితం ఈ ఘటన ఆధారంగా నిర్మించిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ ను చూశాను.


 కాలక్షేపం కోసం అరగంట పాటు చూద్దాం అనుకున్నా కానీ ఏకబిగిన ఏడు గంటల పాటు  ఏడు భాగాలు విడవకుండా చూశాను

 ఇందులో నన్ను అంతగా ఆకర్షించిన రెండు అంశాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల మానవీయ కోణాన్ని ఆవిష్కరించడమే కాకుండా విధినిర్వహణలో వారికి ఎదురయ్యే సవాళ్లను అద్భుతంగా ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ క్రమంలో వారికి వారి కుటుంబ సభ్యులకు మధ్య జరిగే మానసిక సంఘర్షణ హృద్యంగా చిత్రీకరించారు.


 ఇక రెండో అంశం ఘటనకు పాల్పడ్డ నిందితులను త్వరితంగా గుర్తించేందుకు మరియు వారికి కఠినాతి కఠినమైన  శిక్ష పడే టందుకు నేర పరిశోధనలో వారు చూపిన వ్యక్తిగత మక్కువ


 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నిందితులను గుర్తించేందుకు పోలీసు అధికారులు వారి సిబ్బంది పడ్డ శ్రమ వారికి ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏ విధంగా అధిగమించారు అనేదే ఈ సినిమా కథాంశం


 ఈ క్రమంలో వారు ఆరు రోజులపాటు ఇంటికి  వెళ్లకుండా  కుటుంబానికి దూరంగా  ఏవిధంగా  గడిపారో చూపి ఉద్యోగుల అరుదైన  కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు


 చిత్రంలో ప్రధాన పాత్రధారి డిసిపి సౌత్ ఢిల్లీ తన భర్త ఈ పరిశోధన జరిగినంత సేపు  బాగోగులు ఆరా తీస్తూ ఆమెకు అందించే ధైర్యం ఆలోచింపజేస్తుంది


 ఒక కానిస్టేబుల్ తన భార్య తీవ్ర దగ్గుతో ఉండగా, సంఘటన జరిగిన రోజు మందులతో వస్తానని చెప్పి డ్యూటీ కి వెళ్ళి ఆరు రోజుల తర్వాత పరిశోధన పూర్తి చేసుకొని  ఇంటికి వెళతాడు.


 ఇంకో డిసిపి ర్యాంకు అధికారి తన కూతురు వివాహం కోసం ఒకవైపు సంబంధాలు ఆలోచిస్తూ మరోవైపు నేర పరిశోధన కొనసాగిస్తూ ఉంటాడు. చివరకు అయన వెన్నునొప్పి  బాధను గ్రహించిన భార్య ,కూతురు అతని కి ప్రత్యేక కుర్చీ ఆఫీస్కి తీసుకొని వచ్చి ఎలాగో మీరు ఇంటికి రారు  ఇక్కడే కుర్చీలో విశ్రాంతి తీసుకోండి అని కుర్చీ ఇచ్చి వెళ్తారు. ఇలా ప్రతి పాత్రలో కుటుంబ బంధాల్ని  దర్శకుడు ఆవిష్కరించాడు.


 ఇక పోలీసు ఉద్యోగులు నేర పరిశోధన విధానాలు,ఎఫ్ఐఆర్ యొక్క ప్రాముఖ్యత ,సాక్షుల వాంగ్మూలాలు ,ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్, డైయింగ్ డిక్లరేషన్  తదితర విషయాలపై సినిమా ద్వారా అవగాహన పెంచుకోవచ్చు.


 అలాగే ఏ పని లో నైనా బృంద స్ఫూర్తి, మక్కువ ,అంకితభావం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో సినిమా కళ్ళకు కట్టినట్లు చూపెడుతుంది. 


ఈ సినిమా  ప్రభుత్వ ఉద్యోగులు అంటే అలసత్వం,అవినీతిపరులు అని సాధారణంగా మీడియా చూపించే ముద్రను చెరిపి వేయడం ఖాయం


న్యూటన్ గురించి త్వరలో


Monday, June 7, 2010

మగధీర విజయరహస్యం

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకానికి అడుగుపెట్టాను.కారణాలనేకమైనా ఈ రెండు నెలలుగా జరిగిన ఎన్నో సంఘటనలు మీతో పంచుకొవాలి.ముఖ్యంగా కౌముది మాస పత్రిక అమూలాగ్రం చదవాను.నిజంగానన్నో లోకంలోకి తీసుకెళ్ళింది."మొదటి సినిమా" శీర్షిక వర్ఠమాన రచయితల జీవన పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రచన.ఇది ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకం. ఇక యండమూరి వీరేంద్రనాథ్ గారి "పాపులర్ రచయిత అవడం ఎలా? " మరో అద్బుత పుస్తకం.రచయితగ ఎదగాలనికునే ప్రతి ఒక్కరు చదవాల్సిన కాదు కాదు అచరించాల్సిన గొప్ప పుస్తకమది.".. ఇక్కడ మీకో ముఖ్యవిషయం చెప్పదలచుకున్నాను.యండమూరి వీరేంద్రనాథ్ గారు నవలను ఎలా ప్రారంభించాలని చెబుతూ ఇలా అన్నారు."నవల ప్రారంభించబోయే ముందు మనం మెదటి నాలుగు పేజీల్లోనే పాఠకుల్ని మూడ్ లోకి తీసుకెళ్ళాలి. మొదటి అధ్యాయం పూర్తయ్యేసరికల్లా పాఠకుడిని పుస్తకం వదిలిపట్టలేనంత మూడ్ లోకి తీసుకెళ్ళగలిగితే సాధారణంగా ఆ నవల క్లిక్ కాకపొవటం అంటూ జరగదు.నవలా ప్రారంభంలోనే ఏదో ఒక నాటకీయ సంఘటనని సృష్టించటం ఎప్పుడూ పాపులర్ నవలకు మంచిదే.తీసుకున్న థీం ఏదైనా ప్రారంభం మాత్రం అకట్టుకునేలా ఉండాలి."ఇంతకీ ఈ విషయం ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ వాక్యాలు చదివిన తర్వాత "మగధీర" చిత్రం గుర్తొచ్చింది.ఆ చిత్రం అంతగా విజయవంతం కావటానికి కారణం ఏమిటని ఎందరినో అడిగాను.చాలమంది గ్రాఫిక్స్ అంటే ,పాటలని కొందరు,ఆర్ట్ అని కొందరు,ఫైట్స్ అని కొందరు,కాజల్ అందమని కొందరు,పబ్లిసిటీ అని కొందరు, పైవన్నీ అని కొందరు అన్నారు. కాని నాకనిపించిది ఇవ్వన్నీ కాదు.చిత్రప్రారంభంలోని మెదటి సీను. మిత్రవింద,కాలభైరవలు భైరవకొన పైనుంచి గాల్లో తేలిపోతూపడిపొవటం ఎవరో మిత్రుడు అన్నట్టు "రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు"దాన్ని చిత్రం చివరిదాక కొనసాగించగలిగాడు.దీనికి పాటలు,కళ,స్టైల్ ,అదనపు అకర్షణలు వెరసి తెలుగు చిత్రసీమలో అద్బుత విజయం ఆవిష్కృతమైంది.హాలివుడ్ చిత్రాల్లో ఈ తరహా చిత్రణ కనిపిస్తుంటుంది.నాకైతే నవలలు చదవటం అలవాటు లేదు కాని "దిరిసెన పుష్పాలు" బ్లాగు రచయిత్రి గారు కొద్దిగా ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వగలుగుత్తున్నా చివరి దాకా కొనసాగించటంలో ఏదో వెలితి కనిపిస్తుంది.ఇక ఏ బ్లాగర్లు కూడా తమ టపాల్లో ఈరకమైన ఆసక్తి కలిగించే ప్రారంభానిచ్చి చివరికంటా కొనసాగించాలన్న తపన కనిపించకపోవటం పెద్ద లోటే.బ్లాగరు మహాశయులారా,సాయితీప్రియులు,రచయితలు ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి.

Monday, April 12, 2010

సానియా మిర్జా-షోయబ్ ,ఆ నలుగురు

హైదరబాదు లో కర్ఫ్యూ తొలిగింది.నగరానికొక మచ్చలా ఉన్న ఈ భూతం వీడింది.భాగ్యనగర ప్రతిష్ట మరోసారి ప్రపంచ యవనికపై రెపరెపలాడింది.కొంతమంది ఛాందసవాదుల ఫలితంగా విలవిల్లాడిన నగరం పూర్తిగా తెరుకొంది. కాని దురదృష్టకరవిషయమేమిటంటే సానియా వ్యక్తిగత విషయాలను చిలువలు పలువలు చేస్తూ ప్రసారం చెస్తున్న మీడియా ,నగరంలో మతసామరస్యం నెలకొల్పడానికి కృషి చేసిన "శాంతి దూతల"ను విస్మరించింది.సానియ-షోయబ్ ల ప్రేమ,పెళ్ళి విషయాలను ఊదరగొడుతున్న ఛానెళ్ళు,ఆసిఫ్ నగర్ కు చెందిన జితెందర్ మరియు జునైద్ ఖాన్ ల సాహసాన్ని ఊసెత్తలేదు.అల్లర్లు చెలరేగిన 28 వ తేదిన వీరిద్దరు కలిసి అపనమ్మకాలకు కారణమైన తమ బస్తీలోని జెండాలను తొలగించే పనిలో మునిగిపొయారు.వెంటనే మిగతా వారు తోడవడంతో ఆ కాలనీ లో ఎటువంటి అల్లర్లు జరగలేదు.అదెవిధంగా లాల్ దర్వాజ కు చెందిన దయానంద్ యాదవ్,ఆటొలో వెళ్తూ ఒక ముష్కర గుంపుకి చిక్కిన నలుగురు ముస్లిం యువతులను,ఒక బాలుడ్ని రక్షించిన తీరు ఏ ఛానెళుకూ కనబడలేదు.వినబడలేదు.కాని షోయబ్ తన తలక్ నామా లో తండ్రిపేరు తప్పుగా వ్రాసాడు అనే విషయం గొప్పగా పరిశోధన చేసి కనుకున్నాయి.ఇక హరిబౌలికి చెందిన రెహన ఖన్,ఒక గర్భినిని రక్షించి ఆస్పత్రికి చేర్చిన విషయాన్ని ఏ ఛానెలూ ప్రసారం చేయలేదు అదే అయెషా కు గర్భస్రావం అయింది అని వాళ్ళ ఫామిలీ డాక్టరు చెప్పిన విషయాన్ని రోజంతా ప్రసారం చేసారు.రైల్వే రక్షక దళానికి చెందిన శైలేష్ కుమార్ వాల్మీకి అనే ఒక ఇన్స్పెక్టరు ,మారణాయుధాలతో ఘర్షణకు సిద్ధంగా ఉన్న రెండు గుంపుల సమాచారాన్ని ,సర్కిల్ ఇన్ స్పెక్టరుకు చెరవేయటంతో పాటు సామాన్య ప్రజలెవ్వరు ఆ దరిదాపులకు రాకుండా ఆపిన విషయాన్ని ఏ ఛానెళ్ల నైనా మచ్ఛుకైనా కనిపించదు.కాని వస్తున్న బంధువులను ఒక్కర్ని వదలకుండా మనుకు చూపెడుతున్నారు.రండి ఆ శాంతి దూతలకు జేజేలు పలుకుదాం.ఈ మీడియా ధోరణిని ఎండగడదాం.

Monday, March 29, 2010

హైదరాబాద్ జిందాబాద్

మత సామరస్యానికి ప్రతీక,గంగ యమునల సంగమం అని చెప్పుకునే సంస్కృతికి చిహ్నం హైదరాబాద్ మరొక్కసారి కర్ఫ్యూ నీడన చిక్కుకొంది.గత రెండు రోజులుగ జరిగిన చెదురుమొదురు సంఘటనలు తారాస్టాయికి చేరటంతో ఫాతబస్తీలో నిరవధిక కర్ఫ్యూ విధించటం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది।మరో వైపు ఈ సున్నిత పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పాల్సిన రాజకీయ పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్నారు.ఇక మీడియా మతసామర్యాన్ని పెంచే విషయాలను అటుంచి ఈ అల్లర్ల వెనుక "రాజకీయ కుట్రకోణాన్ని" తీవ్రంగా పరిషోధిస్తూ గంటలకొద్ది చర్చల్ని ప్రచారం చెస్తోంది.ఇక మరో వైపు కొంతమంది ఈ అల్లర్ల వెనుక ప్రభుత్వ పతనానికి అధికార పక్షం లోని ఓ వర్గం ప్రయత్నమని ప్రచారం చేసేపనిలో పూర్తిగ నిమగ్నమైంది.మరో వైపు, పాతనగరంలో ప్రాబల్యం ఉన్న ఒక రాజకీయపార్టీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ అల్లర్లను సృష్టిస్తోందంటూ మిగతా రాజకీయ పక్షాలన్నీ విమర్శి స్తుండగా,ఆ రాజకీయ పక్షం మాత్రం మెజారిటి మతానికి చెందిన కొన్ని సంస్ఠల కుట్రగా ప్రతివిమర్శ చెస్తోంది.ఇక ఒక ఉద్యమ పార్టీ నాయకుడు ఒక చర్చలో మాట్లాడుతూ పోలిసు అధికారులందరు వలస ప్రాంతానికి చెందినవారు కావటం మూలాన పరిస్ఠితి చెయ్యిదాటిపోయిందని సూత్రీకరించారు.ఇలా విమర్స,ప్రతివిమర్శలతో ఊదరగొట్టడమేగాని కర్ఫ్యూ లో చిక్కుకొని అల్లాడుతున్న సామాన్యుని బ్రతుకుల గురుంచి గాని,రెక్కాడితే గాని డొక్కాడని దీనుల బ్రతుకుల రక్షణ గురుంచిగాని ఎవ్వరికి ఇసుమింతైనా సానుభూతి లేదు.ఇలా తమ స్వార్థ ప్రయోజనాలకోసం యెవరికి తొచినట్టు వారు ఈ సమస్యను మలచుకునే పనిలో ఉన్నారే గాని కలిసికట్టుగా ఆ ముష్కర మూకలను తరిమికొట్టడానికి ప్రజలందరిని సంఘటితపరచాలన్న ఆలొచన ఏమాత్రం కనిపించటలేదు।వారెన్ని రకాలుగా ప్రయత్నించినా హైదరాబాద్ లోని వివిధ మతాల ,భాషల ,ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న అనుభందాన్ని విడదీయలేరు.దేశ,విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలారా ఒక్కసారి అనండి "హైదరాబాద్ జిందాబాద్"